నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ వరి రైతుల ఆగ్రహాన్ని ఈరోజు గురయ్యారు. నిజామాబాద్, ఆర్మూర్ నుంచి రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకువచ్చి పట్టణంలోని పెర్కిట్ వద్ద గల ఆయన ఇంటిని ముట్టడించి, ఇంటి ముందు ధాన్యం పారబోసి నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో పండిన ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని పసుపు రైతులను మభ్యపెట్టిన్నట్లు ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకుండా మాయమాటలు చెపుతూ తమను వంచిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోగా కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించకపోతే ఇక కేంద్రంపై యుద్ధం మొదలుపెడతామని, రాష్ట్ర బిజెపి నేతల వెంటపడుతామని సిఎం కేసీఆర్ నిన్ననే ఢిల్లీలో హెచ్చరించారు. బహుశః ఆ యుద్ధం కొన్ని గంటల ముందే ప్రారంభించినట్లున్నారు. కనుక నేటి నుంచి రాష్ట్రంలో బిజెపి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బహుశః ఇటువంటి నిరసనలే ఎదురవచ్చు. అందుకు వారు సిద్దంగా ఉంటే మంచిది.