కేంద్రానికి 24 గంటలు డెడ్‌లైన్‌: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకొనేందుకు నేడు ఢిల్లీలో నిరసన దీక్షలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌, కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఈ సందర్భంగా నేను ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కి చేతులు జోడించి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో పండిన ధాన్యం అంతా కేంద్రమే కొనుగోలు చేయాలి. 24 గంటలలోగా కేంద్రం దీనిపై ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాలి. లేకుంటే కేంద్రప్రభుత్వంతో పోరాడేందుకు టిఆర్ఎస్‌ పార్టీ, రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ సిద్దంగా ఉన్నారు. నరేంద్రమోడీజీ...మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ రైతులతో వద్దు. రైతులకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో మీరే చూశారు. ధాన్యం కొనుగోలుచేయాలని మా మంత్రులు, ఎంపీలు ఎన్నిసార్లు కోరినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు పైగా నూకలు తిని బ్రతకండి అంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ మా మంత్రులను ఘోరంగా అవమానించారు. మేమేమైనా పనీపాటులేక, లేదా అడ్డుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? పీయూష్ గోయల్‌... ఈ అవమానాలను మేము తప్పకుండా గుర్తుపెట్టుకొంటాము.

ఈ సమస్యపై మీరు స్పందించకపోవడం వలననే 2,000 కిమీ దూరం నుంచి వచ్చి ఇక్కడ దీక్ష చేయవలసి వచ్చింది. కనుక ఈ దీక్ష చేయడానికి కారకులు మీరే అని మరిచిపోవద్దు. ఇప్పటికైనా తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసి ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలికితే మీకే మంచిది. మోడీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రైతులు విద్యుత్‌ కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, మాకు కేంద్రం ఎటువంటి సహాయసహకారాలు అందించకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకొన్నాము. కోటి ఎకరాలకు నీళ్ళు పారిస్తున్నాము. రైతులకు 24 గతలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాము. రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ రైతన్నలకు అండగా నిలబడ్డాము.

మా ప్రభుత్వం చేసిన కృషి వలననే ఇప్పుడు తెలంగాణలో భారీగా ధాన్యం పండుతోంది. కానీ ఇప్పుడు దానిని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మా రైతుల పరిస్థితి ఏమిటి? కనుక 24 గంటలలో ధాన్యం కొనుగోలుపై మీ నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాను లేకుంటే ఆ తరువాత మా ఈ ఉద్యమం ఉదృతం చేస్తాము,” అని సిఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.