ఏపీలో మళ్ళీ విద్యుత్‌ కోతలు షురూ

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుండగా, పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీ పరిస్థితి మాత్రం రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. తెలంగాణ ఏర్పడక మునుపు సమైక్య రాష్ట్రంలో నిరంతరం విద్యుత్‌ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఉండేవి. తెలంగాణ ఏర్పడగానే సిఎం కేసీఆర్‌ ఈ సమస్యను శాస్వితంగా పరిష్కరించి, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ కూడా ఇస్తున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా ఈ విద్యుత్‌ సమస్యల నుంచి బయటపడగలిగింది. కానీ జగన్ హయంలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది.   

ఇప్పటికే ఏపీలో విద్యుత్‌కి కోతలు మొదలైపోయాయి. పరిశ్రమలకు వారాంతపు పవర్ హాలీ డేస్ (పవర్ కట్) ఉన్నాయి. చివరికి ప్రభుత్వాసుపత్రులకు సైతం విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. తాజాగా గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీలో నిరంతరం (24 గంటలు) పనిచేసే పరిశ్రమలకు 50 శాతం విద్యుత్‌ మాత్రమే వినియోగించుకోవాలని ఏపీ ట్రాన్స్ కో ప్రకటించింది. మిగిలిన పరిశ్రమలు వారాంతపు పవర్ కట్‌కు అదనంగా మరొకరోజు మూసుకోవాలి. సాయంత్రం 6 గంటల తరువాత (షిఫ్ట్) నడుపకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో, షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలలో పగటిపూట ఏసీల వినియోగం 50 శాతం తగ్గించాలి. సైన్ బోర్డులు, వ్యాపార హోర్డింగులకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు విద్యుత్‌ వినియోగించరాదు.  

రాష్ట్రంలో రోజుకి 40-50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ కొరత నెలకొని ఉండటం, పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు విద్యార్దులు కఃదువుకోవలసి ఉన్నందున, గృహావసరాలకు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేయవలసి ఉన్నందున పవర్ హాలీడేస్ విధించవలసి వస్తోందని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ బి.శ్రీధర్ తెలిపారు.