ఏప్రిల్ 14 నుంచే బండి సంజయ్‌ పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14వ తేదీ నుంచి మహా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచే రెండో విడత పాదయాత్ర మొదలుపెడతానని చెప్పారు. మొదటి విడత పాదయాత్రలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియే అని ప్రజలలో నమ్మకం కలిగించగలిగానని అన్నారు. అనేకమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో బందీ అయిపోయిందని, వారి చేతి నుంచి రాష్ట్రాన్ని విడిపించుకొని నిరంకుశపాలన అంతం చేయడమే లక్ష్యంగా రెండో విడత పాదయాత్ర సాగుతుందని బండి సంజయ్‌ చెప్పారు. తన పాదయాత్ర మద్యలో నిర్వహించబోయే బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముగింపు సభకి కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు.