వరంగల్‌లో రాహుల్ గాంధీ బహిరంగసభ

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి పెట్టారు. రాష్ట్రం నుంచి వచ్చిన 40 ముఖ్య కాంగ్రెస్‌ నేతలతో సోమవారం ఢిల్లీలో సమావేశమై పార్టీ అంతర్గత సమస్యలు, నేతల మద్య విభేదాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుదీర్గంగా చర్చించారు. వారి అభ్యర్దన మేరకు తెలంగాణలో పర్యటించేందుకు రాహుల్ అంగీకరించారు. ఈనెల 28,29 తేదీలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఏప్రిల్ 28న వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. మర్నాడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో హైదరాబాద్‌లో భేటీ అవుతారు. 

ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో జరిగిన సమావేశంలో టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలతో పొత్తులు, స్నేహం ఉండబోవని రాహుల్ స్పష్టం చేశారు. బిజెపి, టిఆర్ఎస్‌, మజ్లీస్‌ మూడు పార్టీలను తమ రాజకీయ ప్రత్యర్ధులని, వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టి తగినంత సమయం కేటాయిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. 

రేవంత్‌ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సమావేశంలో మళ్ళీ పిర్యాదులు చేయబోగా రాహుల్ ఆయనను సముదాయించి, అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలమని హితవు చెప్పడంతో జగ్గారెడ్డి మౌనం వహించినట్లు తెలుస్తోంది. 

వచ్చే శాసనసభ ఎన్నికలలో ఆరు నెలల ముందుగానే పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసి టికెట్లు ఇవ్వాలని, అప్పుడే వారు టిఆర్ఎస్‌, బిజెపిలను ఢీకొని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిపోరాడగలరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన సూచనపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.