మింక్ పబ్ లైసెన్స్ రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూప్లాజా హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌ బార్ ఆండ్ రెస్టారెంట్ లైసెన్సును ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. మొన్న ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసినప్పుడు పబ్‌లో కొకైన్ వగైరా మాదకద్రవ్యాలు పట్టుబడటంతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పబ్‌ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, “పబ్‌లలో మాదకద్రవ్యాలు వినియోగించకుండా యజమానులే జాగ్రత్తపడాలని, ఒకవేళ వినియోగిస్తున్నట్లయితే దానికి వారే బాధ్యత వహించి చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని గతంలోనే పబ్‌ యాజమానుల సమావేశంలో స్పష్టంగా హెచ్చరించాము. అయినప్పటికీ పుడింగ్ అండ్ మింక్ పబ్‌ యాజమాన్యం ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేసి పబ్‌లో మాదకద్రవ్యాలను అనుమతించినందున దాని బార్ ఆండ్ రెస్టారెంట్ లైసెన్సును రద్దు చేసి, చట్ట ప్రకారం యజమాన్యంపై చర్యలు తీసుకొంటున్నాము. హైదరాబాద్‌ నగరాన్ని డ్రగ్-ఫ్రీ నగరంగా ఉంచాలని మా ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కనుక ఇక ముందు కూడా మాదకద్రవ్యాలను అనుమతిస్తున్న పబ్బులపై దాడులు నిర్వహించి వాటి లైసెన్స్ రద్దు చేస్తాము. వాటి యజమానులు ఎంత పెద్దవారైనప్పటికీ ఉపేక్షించే ప్రసక్తే లేదు,” అని హెచ్చరించారు.