4.jpg)
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకొన్నారు. ఆయనతో పాటు సతీమణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమారు, టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు తదితరులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో సిఎం కేసీఆర్ దంపతులు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సిఎం కేసీఆర్ భేటీకి అపాయింట్మెంట్ కోరింది. ముందుగా పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యి ధాన్యం కొనుగోలుపై మరోసారి చర్చించనున్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభిస్తే ఆయనను కూడా కలిసి ఇదే విషయం చర్చించనున్నారు.
అయితే ఇప్పటికే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బాయిల్డ్ రైస్ కొనలేమని రాష్ట్రమంత్రులకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సిఎం కేసీఆర్‌కు అదే జవాబు వస్తుందని తెలుసు కనుక ఈనెల 11వ తేదీన ఢిల్లీలో టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు నిరసన దీక్ష చేపట్టనున్నారు.
సిఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజులు ఉంటారని సిఎంవో ప్రకటించింది కనుక ఆ దీక్షలో ఆయన పాల్గొనకపోవచ్చు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఉదృతం చేసిన తరువాత చివరిగా ఢిల్లీలో తన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలిసి సిఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నాలో పాల్గొనవచ్చు.