రాజ్‌భవన్‌లో ఉగాది ఉత్సవాలు...అందరూ డుమ్మా

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో నిన్న ఉగాది ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష నేతలను అందరినీ ఆమె ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతలు వచ్చారు కానీ సిఎం కేసీఆర్‌తో సహా ప్రభుత్వం, టిఆర్ఎస్‌ పార్టీ తరపున ఎవరూ హాజరుకాలేదు. 

తాను ఆహ్వానించినా ప్రభుత్వం తరపున ఎవరూ రాకపోవడంపై ఆమె స్పందిస్తూ, “గవర్నర్‌ హోదాలో నా అధికారాలు, పరిమితులు నాకు తెలుసు. నేను ఎవరితో విబేధాలు కోరుకోను. ఒకవేళ విబేధాలు తలెత్తితే వాటిని తొలగించుకొనేందుకు ప్రయత్నిస్తాను. అందుకే సిఎం కేసీఆర్‌తో సహా అందరినీ ఈ వేడుకలకు రావలసిందిగా ఆహ్వానించాను. కానీ రాలేదు. అది వారిష్టం. వచ్చినవారిని గౌరవిస్తాను రానివారి గురించి పట్టించుకోను. ఒకవేళ సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు నన్ను ఆహ్వానించి ఉంటే నేను ప్రోటోకాల్ పక్కన పెట్టి తప్పకుండా హాజరయ్యేదానిని. ప్రభుత్వపరంగా కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ప్రతీ అంశాన్ని వివాదంగా మార్చాలనికోరుకొనే వ్యక్తిని కాను నేను. అలాగని నేను బలహీనురాలిని కాను. నేను ఎవరూ ఒత్తిళ్ళకు తల వంచను. తెలంగాణ ప్రజలను నేను ప్రేమిస్తాను...గౌరవిస్తాను. వారి కోసమే రాజ్‌భవన్‌ ఉంది. వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి నావంతు కృషి చేస్తాను. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభప్రదంగా సంతోషంగా సాగాలని కోరుకొంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు,” అని అన్నారు. 

రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ముందస్తు వేడుకలకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్ రావు, బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, హైకోర్టు జడ్జీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

వారందరి సమక్షంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేరుపేరునా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడారు. సిపిఐ నేత చాడా వెంకట్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గవర్నర్‌కు పరిచయం చేయడం విశేషం. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ముందస్తు వేడుకలకు ప్రభుత్వం తరపున ఎవరూ రాకపోవడంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కాస్త చిన్నబుచ్చుకొన్నా వేడుకలు చాలా ఆహ్లాదకరంగా సాగాయి.