
ప్రధాని నరేంద్రమోడీని హతమార్చుతామంటూ ముంబైలో జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) కార్యాలయానికి ఓ ఈమెయిల్ ద్వారా బెదింపు లేఖ వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు భారత్లో 20 మంది స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారని వారి వద్ద 20 కేజీల ఆర్డిఎక్స్ ప్రేలుడు పదార్ధాలు కూడా సిద్దంగా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీని అంతమొందించడంతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ ప్రేలుళ్ళకు రంగం సిద్దం అవుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖ అండగానే ఎన్ఐఏ ముందుగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. తరువాత ఈ మెయిల్ ఐపి అడ్రస్ ఆధారంగా బెదిరింపు లేఖను ఎవరు పంపారో కనిపెట్టేందుకు ఎన్ఐఏ బృందాలు రంగంలో దిగాయి.
అయితే ప్రధాని నరేంద్రమోడీ హత్య చేసేందుకు, దేశంలో విధ్వంసం సృష్టించేందుకు స్లీపర్ సెల్స్ నిజంగానే పనిచేస్తున్నాయా? అయినా ఇటువంటి కుట్రలకు పాల్పడేవారు దాని గురించి ముందుగా ఎన్ఐఏకి ఎందుకు తెలియజేస్తారు?ఆవిదంగా చేయడం వలన వారి కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేస్తుంది కదా?కనుక ఎవరో ఆకతాయి ఈ బెదిరింపు లేఖను పంపించాడా? అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.