
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు 8 మంది ఐఏఎస్‌ల అధికారులకు రెండు వారాలు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా వార్డు స్థాయి నుంచి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటికి తగినన్ని భవనాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణాలలో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్వహిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2020లో హైకోర్టు స్పందిస్తూ వాటినన్నటినీ తక్షణం పాఠశాల ఆవరణలో నుంచి తొలగించాలని ప్రభుత్వాధికారులను ఆదేశించింది. అయితే ఆవిదంగా చేస్తే సిఎం, మంత్రుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో వారు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీనిపై మళ్ళీ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, శ్యామలరావు, బుడితి రాజశేఖర్, చిన వీరభద్రుడు, జెకే దివ్వెది, విజయ్ కుమార్, ఎంఎం నాయక్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించింది.
అయితే వారు హైకోర్టుకి క్షమాపణలు చెప్పడంతో దానికి బదులుగా ప్రతీ నెల ఒక రోజు చొప్పున ఏడాదిపాటు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో సేవ చేయాలని, ఆ రోజు విద్యార్దుల మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు అయ్యే ఖర్చును పూర్తిగా వారే భరించాలని హైకోర్టు ఆదేశించింది. దానికి వారు అంగీకరించడంతో జైలు శిక్ష రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.