వికారాబాద్‌ హత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్‌లోని పదో తరగతి విద్యార్ధిని హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబందించి వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈరోజు మీడియాకు తెలియజేసారు. పూడూర్ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన విద్యార్ధిని (15) పదో తరగతి చదువుతోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన మహేందర్ అనే యువకుడితో పరిచయం ఉంది. మొన్న సోమవారం ఉదయం గ్రామం బయట ఇద్దరూ కలుసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు. ఆమె అక్కడికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న మహేందర్ ఆమెను బలత్కరించబోయాడు. దాంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ పెనుగులాటలో ఆమె తల చెట్టుకు బలంగా తగలడంతో స్పృహ కోల్పోయింది. అయినప్పటికీ మహేందర్ ఆమెపై అత్యాచారం చేసి, ఈ విషయం ఆమె ఎక్కడ బయట పెడుతుందో అనే భయంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత ఏమీ జరగనట్లు ఇంటికి వచ్చి నిద్రపోయాడు. 

దర్యాప్తులో లభించిన ఆధారాలతో పోలీసులు గ్రామంలో విచారించగా ఆమెకు మహేందర్‌తో ఏడాదిగా పరిచయమున్నట్లు తేలింది. పోలీసులు అతనిని అదుపులో తీసుకొని ప్రశ్నించడంతో నిజం బయటపెట్టాడు. ఫోరెన్సిక్ నివేదికలో కూడా అతనే అత్యాచారం చేసినట్లు నివేదిక వచ్చింది. కనుక ఈరోజు సాయంత్రం మహేందర్‌ను కోర్టులో ప్రవేశపెడతామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.