
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిన్న తెలంగాణ మంత్రులు, ఎంపీలతో ధాన్యం కొనుగోలుపై సమావేశమైన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు లేనిపోని భ్రమలు కల్పిస్తూ వారిని తప్పు దోవ పట్టిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి దుష్ప్రచారం చేస్తూ కేంద్రంపై బురద జల్లుతున్నారు. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం ముడి బియ్యం (రా రైస్) మాత్రమే కొంటోంది. తెలంగాణ నుంచి గతంలో కంటే ఏడు రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలుచేస్తున్నాము. ఈవేసవి సీజనులో కూడా రాష్ట్ర అవసరాలకు పోగా మిగిలిన రా రైస్ మొత్తం మేమే కొంటామని చెప్పాము.
ఫిబ్రవరి 25న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశమై, ఈ వేసవి సీజనులో ఏ రాష్ట్రం ఎంత రా రైస్ సరఫరా చేయగలదో తెలియజేయాలని కోరారు. ఏపీ 25 లక్షల టన్నులు, ఒడిశా 10 లక్షల టన్నులు సరఫరా చేస్తామని సమాధానం ఇచ్చాయి. మళ్ళీ మార్చి 8న జరిగిన మరో సమావేశంలో జాయింట్ సెక్రెటరీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని రా రైస్ సరఫరా గురించి అడిగారు కానీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు?కనుక ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పు దోవ పట్టించడం, రాజకీయాలు చేయడం మానుకొని ఇకనైనా ఎంత రా రైస్ సరఫరా చేయగలదో తెలియజేస్తే బాగుంటుంది,” అని అన్నారు.