ధాన్యం కొనుగోలు..మళ్ళీ అదే సీన్ రిపీట్

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాల మద్య మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, దయకర్, బిబి పాటిల్, శ్రీనివాస్ రెడ్డిలు గురువారం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సుమారు 45 నిమిషాల సేపు సమావేశమయ్యారు. తెలంగాణలో పండిన వడ్లు అన్ని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు పట్టుబట్టగా ఆయన నిరాకరించారు. కేవలం రా రైస్ మాత్రమే కొనుగోలుచేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 

సమావేశం అనంతరం మంత్రులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో ఉన్నది ఓ వ్యాపార ప్రభుత్వం. దానికి పేదలు, రైతుల సమస్యలతో సంబందం లేదు. వ్యవసాయాధారిత దేశమైన భారత్‌ను పరిపాలించే కనీస లక్షణాలు కేంద్రప్రభుత్వానికి లేవు. కేంద్రమంత్రికి వ్యవసాయ సమస్యలు, విధానాల గురించి కనీస అవగాహన కూడా లేదు. పైగా ఈ సమావేశంలో మమ్మల్ని అవహేళన చేసినట్లు మాట్లాడారు. మా సమావేశం ముగియగానే ఆయన హాడావుడిగా మీడియా ముందుకు వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. 

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సాగునీరు అందిస్తోంది. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌, రైతుబంధు వంటి సంక్షేమ పధకాలు కూడా ఇస్తోంది. అందుకే రాష్ట్రంలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కానీ కేంద్రప్రభుత్వ వైఖరి కారణంగా ఈసారి రాష్ట్రంలో రైతులు 20 లక్షల ఎకరాలలో వరిసాగు తగ్గించుకొన్నారు. 

అదే...కేంద్రప్రభుత్వం ఢిల్లీ శివార్లలో ఏడాదిపాటు రైతులు ఆందోళన చేస్తున్నా, వారిలో 700 మంది రైతులు చనిపోయినా పట్టించుకోలేదు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రైతులకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన సంగతి పీయూష్ గోయల్ మరిచినట్లున్నారు. రాష్ట్రంలో పండే ప్రతీ ధాన్యం గింజను కేంద్రమే కొంటుందని చెపుతున్న రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పుడేమి చెపుతారు?” అంటూ కేంద్రం, బిజెపిల వైఖరిని గట్టిగా నిలదీశారు.