కేంద్రానికి సిఎం కేసీఆర్‌ తుది హెచ్చరిక

సోమవారం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ విస్తృత సమావేశంలో సిఎం కేసీఆర్‌ కేంద్రానికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో పండే వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని వాటిని మర పట్టించుకొని రారైస్ చేసుకొంటుందో బాయిల్డ్ రైస్‌గా చేసుకొంటుందో మీ ఇష్టమని దాంతో తమకు సంబందం లేదన్నారు. ఒకవేళ ధాన్యం కొనుగోలుకి కేంద్రం అంగీకరించకపోతే కేంద్రం దిగివచ్చేవరకు తెలంగాణ ఉద్యమ స్థాయిలో రాష్ట్రంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తన మాటలను ఆషామాషీగా తీసుకోవద్దని తరువాత బాధపడాల్సి ఉంటుందని అన్నారు. 

ఒకప్పుడు పంజాబ్‌లో రైతులు కూడా ఈవిదంగానే ఇబ్బంది పడేవారని అప్పుడు పోరాటాలు చేయడంతో కేంద్రం దిగివచ్చి ఆ రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తోందని అన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ వంటి నినాదాలు చేస్తున్న కేంద్రం, ధాన్యం కొనుగోలుకి కూడా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. పంజాబ్‌కు ఒక విధానం, గుజరాత్‌కు మరో విదానం, తెలంగాణకు ఇంకో విధానం ఎందుకు అమలుచేస్తోందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని కలిసి సవినయంగా విజ్ఞప్తి చేస్తానని కానీ ఆయన స్పందించకపోతే ఆ తరువాత గ్రామస్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉదృతంగా పోరాటాలు ప్రారంభిస్తామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. 

దేశప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. దశాబ్ధాలుగా దోపిడీకి గురవుతున్న దేశంలోని రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్యాంకులను దోచుకోవడం బాగా పెరిగిపోయిందని అన్నారు. దేశంలో బ్యాంకులను దోచుకొంటున్నవారి కోసం రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం రైతుల కోసం 10-15 వేల కోట్లు ఖర్చు చేయడానికి ఎందుకు వెనకాడుతోందని సిఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.