జీయర్ స్వామి క్షమాపణలు చెప్పాల్సిందే: సీతక్క

ఆదివాసీల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆమె నిన్న మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొన్న తరువాత ఆలయ పూజారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరు?భక్తుల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా మాట్లాడవలసిన అవసరం ఏమిటి?ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే లేకుంటే ఆయనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు,” అని హెచ్చరించారు. 

ములుగు, వరంగల్‌, మహబూబాబాద్ జిల్లాలలో జీయర్ స్వామి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివాసీలు నిరసనలు తెలుపుతున్నారు. ములుగు జిల్లా వాజేడు పోలీస్‌స్టేషన్‌లో బీఎస్పీ నేతలు జీయర్ స్వామిపై ఫిర్యాదు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఇంకా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా జీయర్ స్వామి వ్యాఖ్యలను ఖండించి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అయితే ఈ వివాదంపై జీయర్ స్వామి ఇంతవరకు స్పందించలేదు.