ఏమిటా జీవో 111... కేసీఆర్‌ ఎందుకు ఎత్తివేస్తానంటున్నారు

సిఎం కేసీఆర్‌ నిన్న శాసనసభలో మాట్లాడుతూ, జీవో 111ని ఎత్తివేస్తామని అన్నారు. అసలు ఈ జీవో 111 ఏమిటి? ఎందుకు ఎత్తివేస్తానంటున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తుతుండటంతో ప్రముఖ నీటిపారుదల నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా దూరదృష్టితో ఆలోచించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను నిర్మించారు. ఇవి వరదలను నివారించడమే కాకుండా నగరానికి అవసరమైన మంచినీటిని కూడా అందించేవిదంగా రూపొందించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో వాటిని నిర్మించారు కనుక అవి జలకాలుష్యానికి గురి కాకూడదనే ఉద్దేశ్యంతో 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో నంబర్: 111ను తెచ్చింది. 

దీని ప్రకారం రెండు జలాశయాల పరిధిలో సుమారు 1,32,600 ఎకరాల భూమి... దానిలో 83 గ్రామాలు, ఏడు మండలాలు ఉన్నాయి. ఈ భూమిలో రెండు జలశయాలకు 10 కిమీ పరిధిలో గల భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి. ఎటువంటి కాలుష్యకారక పరిశ్రమలు, హోటల్స్, అపార్ట్మెంట్స్, లే అవుట్ వెంచర్స్, కాలనీలు నిర్మించడానికి వీలులేదు. ఆ పరిధి వెలుపల నిర్మించే ఇళ్లకు జి+2కి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక లేఅవుట్లలో 60 శాతం చెట్ల పెంపకం కోసం విడిచిపెట్టాలి. జీవో 111లో ఇంకా ఇటువంటి అనేక కటినమైన నిబందనలు చాలానే ఉన్నాయి.  

అయితే ఇప్పుడు ఎత్తిపోతల పధకాలతో హైదరాబాద్‌ నగరానికి అవసరమైనన్ని మంచి నీళ్ళు తరలించి తెస్తునందున ఇప్పుడు ఆ జలాశయాల నుంచి నీళ్ళు అవసరం లేదు. కనుక అభివృద్ధికి అవరోధంగా మారిన జీవో 111ని రద్దు చేస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

అయితే హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికార పార్టీలో కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తునందునే సిఎం కేసీఆర్‌ జీవో 111ని రద్దు చేసేందుకు సిద్దపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఒకవేళ జీవో 111ని రద్దు చేస్తే అక్కడి ప్రకృతి, జీవ పర్యావరణం సమతులత దెబ్బ తింటుందని పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి, సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడుక సభ్యుడు బీవీ సుబ్బారావు హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసేందుకు పూనుకొంటే న్యాయపోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.