2.jpg)
ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్దాంతరంగా చదువులు ఆపేసి రాష్ట్రానికి తిరిగివచ్చేసిన తెలంగాణ విద్యార్దుల భవిష్యత్ గురించి బహుశః వారి తల్లితండ్రులు, బంధుమిత్రులు తప్ప మరెవరూ ఆలోచించి ఉండరు. కానీ సిఎం కేసీఆర్ ఆలోచించారు. ఓ గొప్ప నిర్ణయం తీసుకొన్నారు.
నిన్న శాసనసభలో మాట్లాడుతూ, “ఉక్రెయిన్లో యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో, ముగిసిన తరువాత మళ్ళీ వారు అక్కడికి వెళ్ళి వైద్య విద్యను అభ్యసించడానికి వీలవుతుందో తెలీని పరిస్థితి. ఇదే విషయం కేంద్రప్రభుత్వానికి కూడా వ్రాసి వారి చదువులు కొనసాగింపుకు సహకరించవలసిందిగా కోరుతాము. కేంద్రప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్దులకు ఎంత ఖర్చు అయినా తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా భరించి చదివిస్తుంది. మన దేశంలో ఉన్నత చదువులకయ్యే ఖర్చు భరించలేకనే పేద, మద్యతరగతి విద్యార్దులు తక్కువ ఖర్చుతో చదువుకొనే వెసులుబాటు ఉన్న ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే కొందరు మంత్రులు వాళ్ళని అక్కడకి ఎవరు వెళ్ళమన్నారు?తిన్నది అరక్క వెళ్లారు అంటూ అంటూ వెటకారంగా మాట్లాడటం చాలా బాధాకరం. విద్యార్దులు ఇక్కడ చదువుకొనేందుకు వెసులుబాటు కల్పించకపోవడం వలననే వారు విదేశాలకు వెళ్ళవలసి వస్తోందనే విషయం మరిచి చులకనగా మాట్లాడుతున్నారు,” అని సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.