
సిఎం కేసీఆర్ ఈరోజు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ అనంతరం సభలో అనూహ్య ప్రకటన చేశారు.
శాసనసభలో మాట్లాడుతూ, “ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వోద్యోగులు కారు. కానీ వారు ఆ భ్రమలో తమకేమీ కాదనే భ్రమతో సమ్మె చేసి ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. వారు తప్పుడు మాటలు విని సమ్మె చేసినందుకు వారిపై మాకేమీ కోపం లేదు. అలాగే వారు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడి తిరుగుతుంటే మాకేమీ సంతోషం కూడా కాదు. అందుకే మా ఎమ్మెల్యేలు, మంత్రులు సూచన మేరకు పెద్దమనసుతో వారందరినీ క్షమించి మళ్ళీ విధులలోకి తీసుకోవాలని నిర్ణయించాము. కనుక మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా అందరూ బుద్ధిగా పనులు చేసుకోవాలని కోరుతున్నాను,” అని సిఎం కేసీఆర్ అన్నారు.
సెర్ఫ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ, “సెర్ఫ్ ఓ సొసైటీ మాత్రమే కనుక దానిలో పనిచేస్తున్న 4500 మంది ప్రభుత్వోద్యోగులు కారు. కానీ వారు రాష్ట్రంలోని మహిళా సంఘాలను చైతన్యపరిచి, సమాజంలో మంచి మార్పులకు దోహదపడుతున్నారు. సెర్ఫ్ ఉద్యోగుల వలన ఆశించిన దాని కంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. కనుక వారి సేవలకు గుర్తింపుగా ఇక పై వారందరికీ కూడా ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాము,” అని సిఎం కేసీఆర్ చెప్పారు. సిఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో సభలో హర్షధ్వనాలు ప్రతిధ్వనించాయి. రాష్ట్రవ్యాప్తంగా సెర్ఫ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు.