ప్రధాని మోడీని కలిసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధాంకాని పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. 

రెండు రోజుల క్రితం మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా రేవంత్‌ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం తప్పని తమ అధిష్టానాన్ని విమర్శించగా, ఇప్పుడు ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంటు సమావేశాలలో ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఫోటో దిగడం విశేషం. 

సింగరేణి గనుల లీజు వ్యవహారంలో సిఎం కేసీఆర్‌ కుటుంబం భారీ అవినీతి, అక్రమాలకి సిద్దం అవుతోందని ఆయన ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో వివిద రంగాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి కూడా ప్రధానికి వివరించానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ప్రధాని మోడీకి వివరించి వాటిని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశానని వెంకట్ రెడ్డి చెప్పారు.

ఒక ఎంపీ ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కరించమని అడగడం తప్పు కాదు. కానీ పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా కాంగ్రెస్ పార్టీని...నాయకత్వాన్ని ఎండగట్టిన తరువాత, బిజెపి చేతిలో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిన తరువాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధానిని ఒంటరిగా కలవడమే అనుమానాలకు తావిస్తోంది. కోమటిరెడ్డి సోదరులిద్దరూ రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నందున ఇద్దరూ బిజెపిలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది.