
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నికలకు మొన్న నోటిఫికేషన్ వెలువడగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నిన్న నామినేషన్ వేశారు. కనుక ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. సిఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా చేసి శాసనమండలి ఛైర్మన్ పదవిని మళ్ళీ ఆయనకే ఖరారు చేయడంతో టిఆర్ఎస్లో మరెవరూ నామినేషన్లు వేయలేదు. కాంగ్రెస్, బిజెపి, మజ్లీస్ పార్టీలకు అభ్యర్ధులని నిలబెట్టి గెలిపించుకొనేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు లేనందున ఆ మూడు పార్టీల నుంచి పోటీ లేదు. కనుక గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మూడు సార్లు ఎంపీగా చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి 2019, సెప్టెంబర్‌లో తొలిసారిగా శాసనమండలి ఛైర్మన్ పదవి చేపట్టి 2021 జూన్ వరకు దానిలో కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ముగియడంతో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తాత్కాలిక ఛైర్మన్ (ప్రోటెం ఛైర్మన్)గా నియమితులయ్యారు. ప్రస్తుతం మజ్లీస్‌కు చెందిన సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ ప్రోటెం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్ళీ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన తరువాత ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించి ఆయన ఆ పదవి నుంచి తప్పుకొంటారు.