హైదరాబాద్‌లో ఆర్బిర్‌టే‌షన్‌ మీడి‌యే‌షన్‌ సెంటర్‌

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిర్‌టే‌షన్‌ మీడి‌యే‌షన్‌ సెంటర్‌ (అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం)కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సింగపూర్‌లో ఇటువంటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఏర్పాటవుతుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. సింగపూర్ కేంద్రం మాదిరిగానే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకొని తద్వారా హైదరాబాద్‌ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమదిస్తుందని ఆశిస్తున్నాను. నేను ఇదివరకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇక్కడ దీనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సిఎం కేసీఆర్‌కు సూచించాను. ఆయన వెంటనే నా ప్రతిపాదనకు అంగీకరించడమే కాకుండా అప్పటికప్పుడు తాత్కాలికంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ  తరువాత ఇక్కడ గచ్చిబౌలిలో 3.7 ఎకరాల స్థలం, భావనా నిర్మాణం కోసం రూ.50 కోట్లు నిధులు కేటాయించారు. ఇంతవేగంగా స్పందించి ఇక్కడ శాస్విత ప్రతిపదికన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మిస్తున్నందుకు నేను సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఒక ఏడాదిలో ఈ భావనా నిర్మాణ పనులు పూర్తయ్యి ఈ మధ్యవర్తిత్వ కేంద్రం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాను. దీంతో అనేక వివాదాలు కోర్టు బయటే పరిష్కారం అవుతాయి,” అని అన్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీ‌శ్‌ చంద్రశర్మ, ఐఏ‌ఎంసీ ట్రస్టీలు, సుప్రీంకోర్టు న్యాయ‌మూ‌ర్తులు జస్టిస్‌ లావు నాగే‌శ్వర్‌‌రావు, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జ్ జస్టిస్‌ ఆర్‌వి రవీంద్రన్, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రక‌ర‌ణ్‌‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ తది‌త‌రులు పాల్గొన్నారు.