తెలంగాణలో ఆమాద్మీ పాదయాత్ర!

సిఎం కేసీఆర్‌ బిజెపికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటుకి ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీని కలుపుకుపోవాలని భావిస్తుంటే, ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం విశేషం. పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలోఆమాద్మీ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీలో మా ఆమాద్మీ ప్రభుత్వం పనితీరుని చూసే పంజాబ్‌ ప్రజలు మమ్మల్ని ఎన్నుకొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆమాద్మీ వైపే చూస్తున్నాయి. తెలంగాణలో సిఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కనుక తెలంగాణలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు మేము గట్టిగా కృషి చేస్తాము. ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఆమాద్మీ పార్టీ పాదయాత్రలు చేపట్టబోతోంది. వచ్చే ఎన్నికలలోగా తెలంగాణలో మా పార్టీని బలోపేతం చేసుకొని టిఆర్ఎస్‌ను ఎదుర్కొంటాము,” అని అన్నారు.