తెలంగాణ భాషకు..యాసకు గౌరవం పెరిగింది..నిజమే

సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ “ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలంగాణ భాషను కామెడీ కోసం ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు  హీరోహీరోయిన్లు సైతం తెలంగాణ భాష..యాసలో డైలాగ్స్ చెపుతున్నారు. తెలంగాణ భాషలో ఉంటేనే ఇప్పుడు సినిమాలు హిట్ అవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల వల్ల ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు అన్నిటికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత లభిస్తున్నాయి,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ చెప్పినది అక్షరాల నిజమని అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమయ్యే టీవీ ఛానల్స్‌లో కూడా తెలంగాణ భాష, యాసతో వార్తలు, విశేషాలు వినిపిస్తుండటం విశేషం. గతంలో విదేశాలలో స్థిరపడిన తెలుగువారిలో తెలంగాణవాసుల గొంతు పెద్దగా వినబడేది కాదు. కానీ ఇప్పుడు వారి గొంతు బలంగా వినబడుతోంది. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిభింబించే బతుకమ్మ పండుగను విదేశాలలో ఘనంగా జరుపుకొంటున్నారు. 

తెలంగాణ ప్రజలకు, భాషకు, యాసకు, పండుగలకు, సంస్కృతీ సాంప్రదాయాలకు సముచిత గౌరవం కల్పించిన ఘనత సిఎం కేసీఆర్‌దే. కనుక ఈ క్రెడిట్ అంతా ఆయనకు, టిఆర్ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు.