26.jpg)
“బుదవారం ఉదయం 10 గంటలకు శాసనసభలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తా...నిరుద్యోగులందరూ టీవీలు చూడండి...” అని సిఎం కేసీఆర్ నిన్న వనపర్తి బహిరంగ సభలో చెప్పారు. నిన్న వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూలులో సిఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “నిరుద్యోగ యువత కోసం బుదవారం పొద్దున నేను అసెంబ్లీలో ఓ ముఖ్య ప్రకటన చేయబోతున్నా. కనుక నేను ఏమి ప్రకటించబోతున్నానో తెలుసుకొనేందుకు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఉదయం 10 గంటలకు టీవీల ముందు సిద్దంగా ఉండాలి. తెలంగాణ రాకమునుపు ఎక్కడ చూసినా వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరెంటు, నీళ్ళ కష్టాలే ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ఏడేళ్ళలోనే ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇదేవిదంగా ఇప్పుడు మన దేశాన్ని కూడా బాగుచేసుకోవాలి. దేశం కోసం నేను నా చివరి రక్తపుబొట్టు వరకు పోరాడేందుకు సిద్దంగా ఉన్నాను. దేశాభివృద్ధిని పట్టించుకోకుండా అధికారం కోసం ప్రజల మద్య మతచిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న బిజెపిని బంగాళాఖాతంలో కలిపేద్దాము,” అని అన్నారు.
తెలంగాణ ఏర్పడక మునుపు నెలకొన్న పరిస్థితులు, ఈ ఏడేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, మార్పులను సభలో సిఎం కేసీఆర్ ప్రజలకు వివరించారు.