కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ భవనాలను కూల్చివేయడంపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరించి మార్కెట్‌ను కూల్చివేస్తున్నారంటూ వ్యాపారులు నేడు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడంతో, తక్షణం కూల్చివేతలు నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గడ్డి అన్నారం మార్కెట్ స్థానంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించి, అక్కడి పళ్ల వ్యాపారులకు బాట సింగారంలోని లాజిస్టిక్ పార్కులో స్థలం కేటాయించింది. కొహెడ వద్ద నిర్మిస్తున్న కొత్త మార్కెట్ నిర్మాణం పూర్తయ్యేవరకు వారిని అక్కడే వ్యాపారాలు కొనసాగించాలని ఆదేశించింది.
అయితే తమకు తగినంత సమయం ఇవ్వకుండా అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించడంతో మార్చి 8వరకు వారి జోలికి పోవద్దని హైకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 8న ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ మార్చి 4వరకు వ్యాపారులను మార్కెట్‌లోకి అనుమతించకుండా అధికారులు అడ్డుపడటమే కాకుండా, నిన్న రాత్రి నుంచి భారీ పోలీస్ బందోబస్తు నడుమ మార్కెట్‌ను కూల్చివేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కారమే అని వ్యాపారుల తరపు న్యాయవాది గంగయ్య నాయుడు పిటిషన్‌లో పేర్కొన్నారు.
కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై విచారణను ఈనెల 14కి వాయిదా వేస్తూ ఆరోజు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి హైకోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.