1.jpg)
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేయనందున వాటికి కొనసాగింపుగా జరుగుతున్న ఈ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో 2022-23 సం.లకి బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేసమయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉభయసభలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రోటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రీల అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఉభయసభల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మర్నాడు అంటే రేపు మంగళవారం ఉభయసభలకు సెలవు ఉంటుంది. మళ్ళీ బుదవారం నుంచి సమావేశాలు కొనసాగుతాయి.