తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లతో కలిసి ఈరోజు ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. మొదట ప్రయోగాత్మకంగా ములుగు, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో ఈ పధకాన్ని అమలుచేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని వెంటనే మొబైల్ యాప్‌లో ఆ వివరాలు నమోదు చేసి వారికి హెల్త్ కార్డులు తయారుచేసి అందజేస్తారని వాటితో ప్రజలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వాటికి అనుబందంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాలలో ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవచ్చునని అన్నారు. ఈ-హెల్త్ ప్రొఫైల్ భాగంగా జారీ చేసే హెల్త్ కార్డులతో 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చునని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి అవసరమైన మందులు అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వైద్య పరీక్షలు, వైద్య చికిత్స అందజేయాలని సిఎం కేసీఆర్ ఈ- హెల్త్ ప్రొఫైల్‌ను ప్రవేశపెట్టారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమం 40 రోజులలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఇటువంటి మంచి పధకం ప్రవేశపెట్టి, దానిని వెనుకబడిన ములుగు జిల్లాలోనే ప్రారంభించినందుకు మంత్రి హరీష్‌రావుకు, సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.