మణిపూర్‌లో కొనసాగుతున్న పోలింగ్

మణిపూర్‌ శాసనసభ ఎన్నికల రెండవ మరియు చివరి విడత పోలింగ్ నేడు జరుగుతోంది. ఆరు జిల్లాలో 22 స్థానాలకు మొత్తం 92 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆరు జిల్లాలో మొత్తం 8,47,400 మంది ఓటర్లున్నారు. వారి కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 1,247 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

మణిపూర్‌ శాసనసభలో మొత్తం 60 స్థానాలున్నాయి. వాటిలో 38 స్థానాలకు ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగింది. నేడు మిగిలిన 22 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మణిపూర్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.