ఫ్రంట్ ఏర్పాటుపై సిఎం కేసీఆర్‌ ప్రకటన

శుక్రవారం ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో భేటీ అయిన తరువాత సిఎం కేసీఆర్‌ రాంచీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా భారత్‌లో జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. కనుక భారత్‌ను గాడిలో పెట్టి అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను ఝార్కండ్ సిఎంకు వివరించాను. వారు కూడా నాతో ఏకీభవించారు. అయితే ఇటువంటి అంశాలపై ఒక్కరో ఇద్దరో కూర్చొని చర్చిస్తే సరిపోదు. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. కనుక దీని కోసం ఏవిదంగా ముందుకు వెళ్ళాలి? ఎవరెవరిని కలుపుకుపోవాలి? అనే అంశాలపై చర్చించేందుకు అందరూ ఒక చోట సమావేశమయ్యి లోతుగా చర్చించాలి. అంతవరకు నేషనల్ ఫ్రంట్ లేదా థర్డ్ ఫ్రంట్ లేదా కొత్త పార్టీ పెడతారా? దానిలో కాంగ్రెస్‌ను కలుపుకొంటారా లేదా? అంటూ ఊహాగానాలు చేయడం అనవసరం. దేశాభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీల నేతలందరూ సమావేశమయ్యి లోతుగా చర్చించిన తరువాత ఏవిదంగా ముందుకు సాగాలనేది నిర్ణయించుకొంటాము. ఇదే పనిమీద త్వరలోనే హేమంత్ సొరేన్‌ను మళ్ళీ కలుస్తాను,” అని చెప్పారు.