రాష్ట్రంలో కేసీఆర్‌ మహిళా బంధు ఉత్సవాలు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి 8వరకు ‘కేసీఆర్‌ మహిళా బంధు ఉత్సవాలు’ పెద్ద ఎత్తున నిర్వహించాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

మార్చి6న సిఎం కేసీఆర్‌కు మహిళలు రాఖీ కట్టడం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్‌ తదితర సంక్షేమ కార్యక్రమాలతో మహిళలకు ఎంతగానో తోడ్పడుతున్న సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్యూ కేసీఆర్‌’ అనే ఆకారంలో మహిళలతో మానవహారాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ సూచించారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన మహిళా వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్య కార్మికులు మరియు ప్రతిభావంతులైన విద్యార్ధినులను, స్వయంసహాయక సంఘాల మహిళా నాయకులకు ఈ సందర్భంగా సన్మానాలు చేయాలని కేటీఆర్‌ సూచించారు.          

మార్చి 7న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులు, ఇతర సంక్షేమ పధకాలలో లబ్ధి పొందిన మహిళల ఇళ్ళకు వెళ్ళి వారితో సెల్ఫీ ఫోటోలు తీసుకొని, సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆయా పధకాల ద్వారా మహిళలు ఏవిదంగా లబ్ది పొందుతున్నారో స్థానిక ప్రజలకు వివరించాలి. 

మార్చి 8న నియోజకవర్గం స్థాయిలో మహిళలతో ఘనంగా సమావేశాలు, సంబురాలు నిర్వహించాలి.    

ఈ మూడు రోజుల కేసీఆర్‌ మహిళా బంధు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షులు అందరూ చొరవ తీసుకోవాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.