4.jpg)
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుదవారం ప్రకటించారు. ఆయన హత్యకు కుట్ర పన్నిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరగడమే ఓ సంచలనం అనుకొంటే, ఈ కుట్రలో బిజెపి నేతలు, మాజీ మంత్రి డికె.అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి సంబందం ఉన్నట్లు అనుమానం ఉందని స్టీఫెన్ రవీంద్ర మరో బాంబు పేల్చారు. ఈ కుట్రలో వారి పాత్రపై లోతుగా దర్యాప్తు చేసిన తరువాత వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు సోదరులు అమరేందర్ రాజు, మధుసూధన్ రాజు, నాగరాజు, రాఘవేందర్ రాజులతో పాటు భండేకర్ విశ్వనాధరావు, తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి, వరద రాజయ్య ఉన్నారు. వీరిలో అమరేందర్ రాజు (టిఆర్ఎస్) ప్రస్తుతం మహబూబ్‌నగర్ మార్కెట్లో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి విభేధాలు ఉన్నాయి.
ఆయన సోదరుడు రాఘవేందర్ రాజు 2018 శాసనసభ ఎన్నికలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని, దానిని మార్చేందుకు ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేశారని 2019, జనవరి 24న కోర్టులో కేసు వేశారు. 2021, ఆగస్ట్ 2న కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన పిర్యాదులపై అటు కోర్టులో ఇటు ఈసీలో విచారణలు కొనసాగుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ఆరోపణలను ఖండించారు. బిజెపికి చెందిన ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎంపీ తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని అప్పుడే ఆరోపించారు.
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిన్న మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్రలో డికె.అరుణ, జితేందర్ రెడ్డిల హస్తం ఉందని అనుమానాలున్నాయని చెప్పడంతో టిఆర్ఎస్, బిజెపిల మద్య మరో యుద్ధం మొదలయ్యింది.