సిఎస్ సోమేష్‌పై రేవంత్‌ రెడ్డి విమర్శలు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌తో సహా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించారు. “సిఎం కేసీఆర్‌ బిహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తన అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకొంటూ రాష్ట్రాన్ని నిలువునా దోచుకొంటున్నారు. విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏరికోరి తెలంగాణకు తెచ్చుకొని వారి అండదండలతో రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తున్నారు. 

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ తన సర్వీసులో సుమారు ఏడున్నరేళ్ళు ఉద్యోగం వదిలి ప్రైవేట్ సంస్థలలో పనిచేశారు. ఆ ఏడున్నరేళ్ళను ఆయన సర్వీసులో నుంచి తగ్గించి చూస్తే ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవి చేపట్టడానికి అర్హులు కారు. కానీ సిఎం కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయంగా, అనుకూలంగా పనిచేస్తున్నందున ఆయనకు ఈ పదవి కట్టబెట్టారు. ఆ కృతజ్ఞతతోనే ఆయన సిఎం కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలను, అవినీతీ ఆయన కప్పిపుచ్చుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో ఎక్కువ మంది బిహార్‌కు చెందినవారే ఉన్నారు. కేసీఆర్‌కు తోడ్పడుతున్న ప్రశాంత్ కిషోర్‌ కూడా బిహార్‌కు చెందినవాడే. సిఎం కేసీఆర్‌ బిహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తెలంగాణ రాష్ట్రాన్ని మరో బిహార్ రాష్ట్రంలా మార్చేయాలని చూస్తున్నారు,” అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.