గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు!

ఈసారి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగం లేకుండా ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాలు నేటికీ ప్రోరోగ్ కానందున వాటికి కొనసాగింపుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తునందున, గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌లో కూడా ఇవి గత సమావేశాలకు కొనసాగింపుగా పేర్కొన్నారు. కనుక చట్టపరంగా, సాంకేతికంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ దీని చాలా కారణాలే కనిపిస్తున్నాయి. 

1. గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, అందుకు ఆయన అర్హుడుకాడని చెపుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దానిని ఆమోదించలేదు. సహజంగానే ఇది సిఎం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. 

2. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతుంటాడటం, వారి పిర్యాదులను స్వీకరిస్తుండటం టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. 

3. బహుశః ఈ రెండు కారణాలతో గవర్నర్‌కు సిఎం కేసీఆర్‌ మద్య దూరం పెరిగినందునే క్రిందటి నెల రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ ప్రభుత్వం తరపు ఎవరూ హాజరవలేదు.   

4. గత కొన్ని నెలలుగా కేంద్రప్రభుత్వం పట్ల సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రజాప్రతినిధుల వైఖరి మారింది. కేంద్రంపై కత్తులు దూస్తున్నారు కనుక కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా భావించబడే గవర్నర్‌ను ఈసారి ఆహ్వానించకపోయి ఉండవచ్చు. 

గవర్నర్‌ను ఆహ్వానించకపోవడానికి గత శాసనసభ సమావేశాలు ప్రోరోగ్ కాలేదనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపుతున్నపటికీ, కాంగ్రెస్‌, బిజెపిలు సిఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళా గవర్నర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా? అని ప్రశ్నిస్తున్నాయి.