49.jpg)
సిఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో మంత్రులతో సమావేశం ముగించుకొన్న తరువాత రాత్రి 7.45 గంటలకు ఢిల్లీ బయలుదేరారు. ఈసారి ఆయన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత,మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, అదనపు డీజీ అనిల్ కుమార్ తదితరులు ఆయనతో ఢిల్లీకి వెళ్ళారు.
కేసీఆర్ బృందం ఢిల్లీలో మూడు రోజులు ఉండబోతున్నారు. ఇవాళ్ళ కేసీఆర్ బృందం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యి జాతీయ రాజకీయాలు, 5 రాష్ట్రాల ఎన్నికలు, బిజెపికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు, దాని కోసం తన ప్రయత్నాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
తరువాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న వివిద ప్రతిపక్ష నేతలతో భేటీ అవుతారు. అలాగే వివిద రంగాలకు చెందిన నిపుణులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమై తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి దేశాభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు అవసరమనే అంశంపై చర్చిస్తారు.
తరువాత ఢిల్లీలో వసంత్ విహార్ వద్ద నిర్మిస్తుయ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్) నిర్మాణ పనులను పరిశీలిస్తారు. సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని భావిస్తున్నారు కనుక ఈ ఏడాది దసరాలోగా దానిని ప్రారంభించి, అక్కడి నుంచే తన జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 7వ తేదీన యూపీ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ జరగనుంది. దానిలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం (లోక్‌సభ) వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కూడా ఉంది. కనుక మార్చి 3వ తేదీన ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్ళి ముందుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని, వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది.