బిజెపిలో బండికి అసమ్మతి సెగలు

ఒకప్పుడు రాష్ట్రంలో నిద్రావస్థలోకి జారుకొన్న బిజెపి, బండి సంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత పరుగులు తీయడం ప్రారంభించింది. గత రెండేళ్ళలో రాష్ట్రంలో క్రమంగా బలపడుతూ ఇప్పుడు టిఆర్ఎస్‌నే ఢీకొని సవాలు చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఈ క్రెడిట్ తప్పకుండా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కే దక్కుతుందని చెప్పవచ్చు. 

సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ పార్టీని బలంగా ఢీకొంటూ పార్టీలో అందరికీ మళ్ళీ నమ్మకాన్ని, కొత్త ఉత్సాహాన్ని కలిగించి బిజెపిని చాలా జోరుగా ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే ఒకప్పుడు కాంగ్రెస్‌ను తప్ప బిజెపిని పట్టించుకోని సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ నిత్యం బిజెపి, బండి సంజయ్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రప్రభుత్వ నామస్మరణ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బిజెపిలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి సెగలు రగులుతుండటం విశేషం. 

బండి సంజయ్‌ మంగళవారం కరీంనగర్‌లో ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే పాత పది జిల్లాలకు చెందిన బిజెపి నాయకులు హైదరాబాద్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒక్కో జిల్లా నుంచి పది మంది చొప్పున సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. వారిలో బిజెపి కరీంనగర్‌ మాజీ అధ్యక్షుడు అర్జున్ రావు, కిసాన్ మోర్చా మాజీ సభ్యుడు సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, రాజారమణి, రాములు తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

తాము ఎప్పటి నుంచి అంకితభావంతో పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తుంటే బండి సంజయ్‌ తమను పట్టించుకోకుండా నిన్నగాక మొన్న వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు మండిపడ్డారు. బండి సంజయ్‌ ఒంటెత్తుపోకడలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.  

అసమ్మతివాదుల రహస్య సమావేశంపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. “బిజెపి క్రమశిక్షణ కలిగిన పార్టీ. కనుక ఎంత సీనియర్ నాయకులైనా అందరూ పార్టీ సిద్దాంతాలు, విధానాలకు కట్టుబడి పనిచేయాల్సిందే. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.