
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ను సిఎం కేసీఆర్ నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లిలో మల్లిఖార్జునస్వామికి పూజలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి దీనిని అడ్డుకొనేందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయి. కానీ నేను చొరవ తీసుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి రాష్ట్రానికి జీవనాడి వంటి ఈ ప్రాజెక్టును అడ్డుకోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశాను. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అవరోధాలన్నిటినీ తొలగించి సహకరించడంతో ఈ ప్రాజెక్టును నిర్మించుకోగలిగాము.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాదిమంది కార్మికులు, ఇంజనీర్లు, అధికారులు, మంత్రి హరీష్‌రావు తదితరులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి మూడేళ్ళ వ్యవధిలోనే అద్భుతంగా నిర్మించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే తపనతో రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా అనేకమంది స్వచ్చచందంగా ముందుకు వచ్చి ఈ మహత్కార్యంలో పాలుపంచుకొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపణుచుకొన్న ప్రతీ ఒక్కరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
ఆనాడు గోదావరి నీళ్ళతో మల్లన్న పాదాలు కడుగుతామని చెప్పాను. ఇప్పుడు ఏకంగా అభిషేకాలు చేస్తున్నాము. ఇది కేవలం మల్లన్న సాగర్ కాదు...తెలంగాణ రాష్ట్రాన్ని జలాభిషేకం చేసి సాగరం. దీంతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సింగూరు కంటే గొప్పగా దీనిని నిర్మించుకొన్నాము. దీంతో హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాస్విత పరిష్కారం చేసుకోగలుగుతాము,” అని సిఎం కేసీఆర్ అన్నారు.