సంగారెడ్డి, జహీరాబాద్‌లకు 100 కోట్లు.. పంచాయతీలకు 140 కోట్లు

సిఎం కేసీఆర్‌ సంగారెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాకు పలు వరాలు కురిపించారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు చెరో రూ.50 కోట్లు చొప్పున రెంటికీ కలిపి మొత్తం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో నారాయణఖేడ్, సదాశివపేట, జోగిపేట, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.    

సంగారెడ్డి జిల్లాలో గల 699 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.140 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నిటి కోసం ఒకటి రెండు రోజుల్లో జీవోలు జారీ చేస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

త్వరలో సంగమేశ్వరం ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. ప్రజా ప్రతినిధుల అభ్యర్ధన మేరకు నిజాంపేటను మండల కేంద్రంగా మారుస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

అంతకు ముందు సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పధకానికి సిఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ. 4,427 కోట్లు ఖర్చు చేయబోతోంది. రాబోయే రెండేళ్ళలోగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేస్తామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఇది పూర్తయితే జిల్లాలో 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.