విశాఖలో నేడు నేవీ ప్రదర్శనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

ఏటా విశాఖ సముద్రతీరంలో భారత నావికాదళం నేవీ ఫ్లీట్‌లో భాగంగా యుద్ధనౌకలు, హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శిస్తుంటుంది. అలాగే త్రివిద దళాధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతి కూడా తన పదవీకాలం ఒక్కసారి విశాఖకు వచ్చి ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ పేరిట జరిగే భారత నావికాదళం యుద్ధ సంసిద్దతను పరిశీలిస్తారు.   

నేటి నుంచి మూడు రోజులపాటు విశాఖ రామకృష్ణా బీచ్‌ సముద్రతీరంలో ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ-22 (పిఎఫ్ఆర్-22) జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నిన్న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖపట్నానికి వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. 

సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి ఆర్‌కె బీచ్‌ వద్ద సముద్రతీరంలో జరిగే పిఎఫ్ఆర్-22ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిలకిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకొని ‘ఇండియన్ నేవీ-75 ఏళ్ళ దేశ సేవ’ అనే థీమ్‌తో నేవీ కార్యక్రమాలు రూపొందించుకొంది. 

ఇవాళ్ళ జరిగే పిఎఫ్ఆర్-22లో రెండు భారీ యుద్ధ నౌకలు, అనేక చిన్నాపెద్ద యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు అన్ని కలిపి మొత్తం 60 నౌకలు, 50 యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, 10 వేల మంది నావికా సిబ్బంది పాల్గొని విన్యాసాలు ప్రదర్శిస్తారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు.