యూపీ, పంజాబ్‌లో నేడు పోలింగ్

నేడు యూపీ, పంజాబ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలకు ఇప్పటికే రెండు దశలలో పోలింగ్ పూర్తవగా, నేడు మూడో దశలో మరో 59 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పంజాబ్‌ శాసనసభలో 117 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.

యూపీలో 59 స్థానాలకు 627 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, పంజాబ్‌లో 117 స్థానాలకు 1304 మంది పోటీ పడుతున్నారు.

యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ నేతృత్వంలో అధికార బిజెపికి ఈసారి ఎదురుగాలులు వేస్తున్నాయి. కనుక ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. యూపీ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ కూడా 80 స్థానాలకు పోటీ చేస్తోంది. ఒకవేళ మజ్లీస్ కనీసం 20-25 సీట్లు గెలుచుకోగలిగినా యూపీ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

ఇక పంజాబ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ తాపత్రయపడుతుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి తహతహలాడుతోంది. ఇక ఢిల్లీకె పరిమితమైన ఆమాద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పంజాబ్‌లో కూడా తన పార్టీని విస్తరించుకోవాలని తహతహలాడుతోంది. కనుక యూపీ, పంజాబ్‌ రెండు రాష్ట్రాలలో కూడా చాలా ఉత్కంఠమైన పోరు కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీన వెలువడతాయి.