
మేడారంకు సమీపంలో గత్తమ్మ ఆలయం సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చంద్రుపట్ల (జెడ్) నుంచి వస్తున్న కారును మేడారం నుంచి హన్మకొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటన స్థలంలోనే చనిపోగా జ్యోతి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రోడ్డు ప్రమాదంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి వాహనాలు క్లియర్ చేశారు. కారులో చిక్కుకుపోయిన నలుగురి మృతదేహాలను, గాయపడిన జ్యోతిని అతికష్టం మీద పోలీసులు బయటకు తీసారు. మృతులు ములుగు జిల్లా వాజేడు మండలంలోని చంద్రుపట్ల (జెడ్) గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన కమ్మపతి శ్రీనివాస్, రమేశ్, సుజాతగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో మరొకరు డ్రైవర్ బుద్ధి కళ్యాణ్ అని పోలీసులు గుర్తించారు.
ఈ మార్గంలో మద్యలో ఎక్కడా స్పీడ్ బ్రేకర్స్, సిగ్నల్స్, డివైడర్ లేకపోవడంతో వాహనాలు చాలా వేగంగా వెళుతుంటాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ బస్సు, కారు కూడా చాలా వేగంగా వెళుతూ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఆర్టీసీ బస్సు ముందుభాగమ్ కూడా దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం కొరకు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.