
ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్లో పర్యటించినప్పుడు సిఎం కేసీఆర్ రాకపోవడం, త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్న గొప్ప నాయకుడంటూ ప్రశంశలు కురిపించడంతో సిఎం కేసీఆర్కు జీయర్ స్వామికి మద్య విభేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై జీయర్ స్వామి వెంటనే స్పందిస్తూ, “నాకు సిఎం కేసీఆర్ మద్య ఎటువంటి విభేధాలు లేవు. ఆయన సహకారంతోనే శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరోజు ఆయన ఆరోగ్యం బాగోనందున సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. కనుక మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. నిజానికి రాజకీయాలలో మాత్రమే స్వపక్షం, విపక్షం ఉంటాయి తప్ప భగవంతుడి ముందు అందరూ సమానమే. కనుక మేము కూడా అందరినీ సమానంగానే ఆదరిస్తాము. అందుకే సర్వమానవ సమానత్వాన్ని చాటే ఈ ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా ముస్లిం మత పెద్దలను కూడా ఆహ్వానించాము,” అని చెప్పారు.