కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు పార్టీకి రాజీనామా?

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో కొందరు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నేను పార్టీలో కోవర్టునని దుష్ప్రచారం చేస్తున్నారు. దశాబ్ధాలుగా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే రకరకాలుగా నన్ను అవమానిస్తూ పార్టీలో ఉండలేని పరిస్థితి కల్పించి బయటకు వెళ్ళేలా చేస్తున్నారు. పార్టీలో పరిస్థితులు, పార్టీలో నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలను మా అధినేత్రి సోనియా గాంధీకి లేఖ ద్వారా తెలియజేస్తాను. పార్టీకి, పార్టీలో నా పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నాను. నా రాజీనామా లేఖను శనివారం మా పార్టీకి పంపిస్తాను. తరువాత నా భవిష్యత్‌ కార్యాచరణ గురించి నా అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు. 

పిసిసి అధ్యక్ష పదవికి గట్టిగా పోటీ పడినవారిలో జగ్గారెడ్డి కూడా ఒకరు. పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోగా తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనే పనిచేయవలసి వస్తుండటంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ తరువాత ఆయన రేవంత్‌ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేసినందుకు, మీడియా ముందుకు వచ్చి పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడినందుకు పార్టీ అధిష్టానం మందలించడంతో జగ్గారెడ్డి ఆత్మాభిమానం దెబ్బతిని ఉండవచ్చు. ఆ తరువాత ఆయన తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను రెండు మూడుసార్లు కలవడంతో టిఆర్ఎస్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు హటాత్తుగా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించడంతో అవి నిజమేనని నమ్మవలసివస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. అప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది.