లాలూ ప్రసాద్ మళ్ళీ జైలుకే...

ఒకప్పుడు బిహార్ సిఎంగా, రైల్వేమంత్రిగా ఓ వెలుగువెలిగిన లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు. 1996లో పశువుల దాణా కుంభకోణంలో రూ.139.5 కోట్లు కొట్టేశారనే ఆరోపణలతో సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అప్పటి నుంచి నేటి వరకు అంటే సుమారు 32 సంవత్సరాలపాటు సిబిఐ కోర్టు విచారణ జరుపుతూనే ఉంది. వాటికి సంబందించి 5 కేసులు నమోదు కాగా వాటిలో లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా మొత్తం 170 మందిపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వారిలో 55 మంది చనిపోయారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. 34 మందిని దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించింది. మరో 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఇంకా 41 మందికి శిక్షలు ఖరారు కావలసి ఉంది. ఐదు కేసులలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా సిబిఐ కోర్టు నిర్ధారించింది. ఈ నెల 21న ఆయనతో సహా మిగిలిన అందరికీ శిక్షలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. 

తాను వృద్ధుడినని, చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కనుక తనను ఆసుపత్రిలో చేర్చాలని కోరుతూ లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టుకొన్న పిటిషన్‌ను సిబిఐ కోర్టు తిరస్కరించడంతో రాంచీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బిస్రా ముండాలోని సెంట్రల్ జైలుకి తరలించారు.

ఇన్ని అక్రమాలకు పాల్పడినప్పటికీ అవకాశం చిక్కితే దేశానికి ప్రదానమంత్రి కావాలని తహతహలాడిన లాలూ ప్రసాద్ యాదవ్ చివరికి ఈ వయసులో జైలులో ఊచలు లెక్కబెట్టబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురేలేదని విర్రవీగేవారికి లాలూ కధ ఓ గుణపాఠం వంటిది.