.jpg)
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇవాళ్ళ తన ఇంటికి వచ్చిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సిఎం కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేశారు.
“అయ్యా కేసీఆర్ గారు ఈ నెల 17న మీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు జరుపుకోవాలని మీ కుమారుడు కేటీఆర్‌గారు టిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు రోజులు కాకపోతే ముప్పై రోజులు వేడుకలు జరుపుకోండి మాకేమీ అభ్యంతరం లేదు కానీ కనీసం మీ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పుణ్యం కట్టుకోండి. తెలంగాణ సాధించుకొన్నదే ఉద్యోగాల కోసం. కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్ళయినా ఇంతవరకు ఉద్యోగాలు లేవు...నోటిఫికేషన్లు లేవు.
తెలంగాణ రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఇంకా ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే 1.90 లక్షల ఉద్యోగాలు వస్తాయని...వాటితో తమ జీవితాలు చక్కబడతాయని కలలు కంటూ అనేకమంది యువతీయువకులు గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చి హాస్టల్స్‌లో ఉంటూ వేలరూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఎంతకూ రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్ళి తల్లితండ్రులకు మొహం చూపించలేక హైదరాబాద్‌లో బందీలుగా ఉంటున్నారు. అనేకమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి మీరే కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామంటున్నారు మంచిదే. కానీ భోదించడానికి టీచర్లు ఎక్కడున్నారు?ఏడేళ్ళుగా ఒక్కసారి కూడా మీ ప్రభుత్వం డీయస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే మా హయాంలో ఐదేళ్ళలోనే మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చింది. కనుక మీ పుట్టినరోజును పురస్కరించుకొనైనా ఫిబ్రవరి 17న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.