
సిఎం కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని గట్టిగా వెనకేసుకువచ్చి మళ్ళీ అసోం ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. దీనిపై విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నెహ్రూ కుటుంబంలో ఎందరో ప్రధానులుగా దేశాన్ని పాలించారు. ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్న సీనియర్ నాయకుడు. ఆ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేశారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిపై అసోం ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలు చేయడాన్ని మాత్రమే నేను ఖండిస్తున్నాను. రాజకీయాలలో ఎవరైనా కటువుగా విమర్శలు చేయవచ్చు విధానాలను ప్రశ్నించవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు చేయడం తగదు. నేను ఎన్నడూ నా రాజకీయ ప్రత్యర్ధులపట్ల అనుచితంగా మాట్లాడలేదు. మాట్లాడబోను కూడా. రాహుల్ గాంధీ విషయంలో నేను ఈవిదంగా మాట్లాడటం చూసి కొందరు చిల్లరమల్లరగా మాట్లాడవచ్చు వ్రాయవచ్చు. కానీ మేము కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం లేదు. దానికి మద్దతు ఇవ్వడం లేదు. నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని అనుచితంగా మాట్లాడటాన్ని మాత్రమే నేను ఖండిస్తున్నాను,” అని అన్నారు.