రాజ్యాంగాన్ని మార్చాల్సిందే: సిఎం కేసీఆర్‌

తెలంగాణ సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌లో లేని వనరులు అంటూ లేవు. కనుక గట్టిగా పట్టుబట్టి ప్రయత్నిస్తే రెండేళ్లలోనే భారత్‌ అగ్రరాజ్యాల సరసన నిలబడేలా చేయవచ్చు. కానీ దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రజల మత విద్వేషాలు రెచ్చగొడుతూ చీలికలు సృష్టించి పబ్బం గడుపుకొంటోంది. కనుక భారత్‌ ఎన్నటికీ తమ స్థాయికి ఎదగలేదని అగ్రదేశాలు భావిస్తున్నాయి. 

భారత్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కొత్త రాజ్యాంగం వ్రాసుకోవలసిందే. దేశంలో పెరిగిన దళిత జనాభాకు న్యాయం చేయాలన్నా, అన్ని రంగాలలో మహిళలకు పూర్తి భద్రత, సమానావకాశాలు కల్పించాలన్నా కొత్త రాజ్యాంగం అవసరం. మౌలికవసతులు పెంచుకొనేందుకు కొత్త రాజ్యాంగం అవసరం. దేశంలో ఫెడరల్ స్పూర్తి కోసం, రాష్ట్రాలకు సమాన న్యాయం, గౌరవం కోసం కొత్త రాజ్యాంగం అవసరం. 

నలబై ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్న నేను క్షుణ్ణంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తరువాతే ఈ సూచన చేశాను తప్ప ఏదో నోటికి వచ్చినట్లు అనలేదు. నేను చేసిన ఈ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నాను. దీనిపై అప్పుడే జాతీయ స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. ఇంకా లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 

“డాక్టర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనడం దళితులను అవమానించడమే కదా?” అనే ఓ విలేఖరి ప్రశ్నపై సిఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు ఏ టీవీ ఛానల్... ఏ పేపర్ తరపున వచ్చావు? అని అడిగి ‘నేను చెపుతున్నాను రాసుకో... ‘ అంటూ పైన పేర్కొన్న ఒక్కో అంశాన్ని చెపుతూ ‘ఏం తప్పా...?’ అంటూ పదేపదే నిలదీశారు. ‘రాజ్యాంగం మార్చడానికి, దళితులకి సంబందం ఏమిటి? రెంటినీ ఎందుకు ముడిపెడుతున్నావు?’ అంటూ విలేఖరిని నిలదీశారు.   

డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందజేసినప్పుడే దాని స్పూర్తితో దేశం అభివృద్ధిపదంలో సాగాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ స్పూర్తి కనబడటం లేదు కనుకనే దేశ వర్తమాన, భవిష్య కాలమాన అవసరాలకు తగినట్లు కొత్త రాజ్యాంగం వ్రాసుకోవలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్‌ గట్టిగా నొక్కి చెప్పారు.