అవసరమైతే పార్టీ పెడతా: సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ అసమర్ధ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే లేకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. భారతదేశాన్ని కాపాడుకొనేందుకు కలిసి వచ్చే అన్ని పార్టీలను కూడగట్టి పోరాడేందుకు నేను సిద్దం. ఇదే అంశంపై చర్చించేందుకు త్వరలోనే ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం కాబోతున్నాను. ఒకవేళ అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తాను. అదేమీ పెద్ద విషయం కాదు. 

అయితే జాతీయస్థాయిలో పెను మార్పు తీసుకురావాలంటే పార్టీలు... వాటి నాయకులు కాదు... ముందుగా ప్రజలు చైతన్యవంతం అవ్వాలి. అప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. తెలంగాణ ప్రజలను ఏకం చేసి పోరాడేలా చేసినందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబునాయుడువంటి అనేకమంది నాయకులు, వారి పార్టీలు కూడా ఉద్యమానికి మద్దతు ఈయక తప్పలేదు. కనుక జాతీయస్థాయిలో మార్పు జరగాలన్నా ముందుగా ప్రజలు చైతన్యంకావాలి. వారిని ఎప్పుడు, ఏవిదంగా చైతన్యపరచాలో...ఏవిదంగా ముందుకు నడిపించాలో నాకు బాగా తెలుసు. రాబోయే రోజుల్లో ఇది తప్పక జరుగుతుంది.

మన ప్రధాని నరేంద్రమోడీ ఒకప్పుడు బస్టాండులో ఛాయ్ అమ్ముకొని బ్రతికేవాడినని స్వయంగా పలుమార్లు చెప్పుకొన్నారు. అలాగే సినిమా నటులు స్వర్గీయ ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్, జయలలిత వంటివారు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రజలు కోరుకొంటే ఏదైనా సాధ్యమే. మన ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనమే అది. భవిష్యత్‌లో కూటమి ఏర్పడుతుందా లేదా కొత్త పార్టీ పెట్టాలా?అనేది ఇప్పుడే చెప్పలేను కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది,” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు.