కేంద్రప్రభుత్వంపై మళ్ళీ నిప్పులు చెరిగిన సిఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్ళీ నిన్న సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రధాని నరేంద్రమోడీపై, కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే భారత్‌కు కొత్త రాజ్యాంగం వ్రాసుకోవాలనే తన ప్రతిపాదనను గట్టిగా సమర్ధించుకొన్నారు. 

సుమారు రెండు గంటలసేపు సాగిన ప్రెస్‌మీట్‌లో సిఎం కేసీఆర్‌, కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ఏవిదంగా వివక్ష చూపుతోందో వివరించారు. రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బిఎం కింద రుణాలు ఇస్తామని ఆశ చూపుతూ, విద్యుత్ సంస్కరణల పేరిట వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందని ఏపీ ప్రభుత్వం అందుకు అంగీకరించగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లోనే ఈవిషయం పేర్కొందని కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి అర్ధం కాక మోటర్లకు మీటర్లు బిగించమని కేంద్రప్రభుత్వం చెప్పలేదని మాట్లాడుతూ బిజెపి పరువు తీస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

బిజెపికి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన లేదని, ఎన్నికలు వచ్చినపుడల్లా సరిహద్దులలో హడావుడి చేసి లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం దురలవాటుగా మారిపోయిందని సిఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేక దొడ్డి దారిన గవర్నర్ల అండదండలతో అధికారం చేజిక్కించుకొంటుందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచేయడం ఖాయమని సిఎం కేసీఆర్‌ అన్నారు.