22.jpg)
జనగామలో నిన్న జరిగిన బహిరంగ సభలో సిఎం కేసీఆర్ మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణకు ఏవిదంగాను సహాయసహకారాలు అందించకపోగా రాష్ట్రంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్రంతో పోరాటానికి సిద్దమని ప్రకటించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి బిజెపిని నరేంద్రమోడీ దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. రాష్ట్ర బిజెపి టిఆర్ఎస్ జోలికి వస్తే కబడ్దార్ అని హెచ్చరించారు. ‘ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టిఆర్ఎస్...మేము ఉఫ్ మని ఊడితే రాష్ట్రంలో బిజెపి కనబడకుండా పోతుందని కనుక మా జోలికి రావద్దని’ రాష్ట్ర బిజెపి నేతలను హెచ్చరించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశ్యించి ‘మీ ఉడత బెదిరింపులకు భయపడబోనని’ హెచ్చరించారు. ‘ఇప్పటివరకు తెలంగాణ కోసం పోరాడిన నేను దేశం కోసం బాధ్యత తీసుకొనేందుకు సిద్దంగా ఉన్నాను... కేంద్రంతో కొట్లాడాలా వద్దా మీరే చెప్పండి...’ అంటూ సభకు వచ్చిన ప్రజలను అడిగారు.
గత శాసనసభ ఎన్నికల తరువాత వరుసగా ఆరేడు నెలల పాటు రాష్ట్రంలో వివిద ఎన్నికలు జరుగుతునప్పుడు సిఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ వరుస ఎన్నికలతో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ఇబ్బందే కానీ ఒకసారి ఈ ఎన్నికలన్నీ పూర్తయిపోతే ఇక మిగిలిన నాలుగున్నరేళ్లు ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా పాలనపై పూర్తిగా దృష్టి పనిచేసుకోగలుగుతుంది,” అని అన్నారు. కానీ శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే సిఎం కేసీఆర్ ఇప్పటి నుంచే పార్టీని, ప్రజలను ఎన్నికలకు సిద్దం చేస్తుండటం విశేషం.
సిఎం కేసీఆర్ కేంద్రం, బిజెపిలపై ఈస్థాయిలో విరుచుకుపడటం చూస్తే రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని, ఆ పార్టీయే టిఆర్ఎస్‌కు ప్రధాన రాజకీయ శత్రువని సిఎం కేసీఆర్ స్వయంగా అంగీకరించినట్లవుతోంది. బిజెపి కూడా సరిగ్గా ఇదే కోరుకొంటోంది. కనుక సిఎం కేసీఆర్ స్వయంగా తమ బలాన్ని గుర్తించి ఆయనే స్వయంగా ప్రజలకు చాటి చెపుతున్నందుకు వారు కూడా చాలా సంతోషిస్తుండవచ్చు.