జస్టిస్ ఎన్.వి.రమణ యాదాద్రి పర్యటన వాయిదా

ప్రస్తుతం హైదరాబాద్‌లో బస చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు నేడు యాదాద్రికి వెళ్ళి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలనుకొన్నారు. కానీ ఇవాళ్ళ జస్టిస్ ఎన్.వి.రమణ తండ్రిగారి సంవత్సరీకం కావడంతో వారి పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్.వి.రమణను సిఎం కేసీఆర్‌ మొన్న రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు అత్యంత వైభవోపేతంగా పునర్నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని దర్శించవలసిందిగా ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు. కనుక గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌ ఇరువురూ కూడా నేడు యాదాద్రి పర్యటనకు బయలుదేరాలనుకొన్నారు. కానీ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతుల యాదాద్రి పర్యటన రేపటికి వాయిదా పడటంతో గవర్నర్‌ తమిళిసై, సిఎం కేసీఆర్‌ పర్యటన కూడా రేపటికి వాయిదా పడింది. వారి పర్యటన సందభంగా మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత శనివారం యదాద్రి చేరుకొని ముందస్తు ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు.  

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు నిన్న ఆదివారం హైదరాబాద్‌ ఎస్‌ర్‌ నగర్‌లోని  జస్టిస్ ఎన్.వి.రమణ నివాసానికి వెళ్ళి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.